“రేడియో అక్కయ్య” ఇక లేదు!
” రారండోయ్ …రారండోయ్ బాలబాలికలు రారండోయ్ బాల వినోదం కనరండోయ్ ”
అరవై ,దెబ్భయ్ దశకాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఆకాశవాణి శీర్శికా గీతం.ఆదివారం మధ్యాహ్నం రేడియో చుట్టూ మూగి ,ప్రసారమయిన మాటలు పాటలు ,నాటికలు, అన్నయ్య అక్కయ్య ల సంభాషణలు అన్నీ “చాలిక మాటలు చాలిక పాటలు …చెంగున పోదాము ..చెంగుచెంగునా పోదాము ” అనేదాకా విని అదో లోకం లోకి వెళ్లి పోయిన రోజులు ఒక్క సారిగా కళ్ల ముందు డేరాలు వేసుకున్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కటొక్కటే గుర్తుకు రావటానికి కారణం రేడియో అక్కయ్య ఇకలేరు అన్న ఎఫ్బీ పోస్టింగ్ చూసి.
నాకు ముందు తురగా జానకీ రాణిగా తెలిసిన తరువాతే ఆ తరువాత ఆకాశవాణి బాలానందం కార్యక్రమం నిర్వహించే అక్కయ్యగారు ఈవిడేనని తెలిసింది. నా త్రిపదుల సంకలనం “మువ్వలు” త్యాగరాయ గాన సభలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది. ఆ సభలో సీనియర్ జర్నలిస్టు శ్రీ పెండ్యాల వామన రావు గారు (న్యూ స్వతంత్ర టైమ్స్ ఎడిటరు, మా నాన్నకు మేనత్త కుమారుడు , మాకు గాడ్ ఫాదర్ )ఉన్నారు. వారికి అందజేసిన పుస్తకాన్ని తమ పత్రికలో బుక్ రివ్యూకై తురగా జానకీ రాణి కిస్తే రివ్యూ రాసారు. మామయ్య పంపిన పుస్తకం చూసి అందులో నా రివ్యూ రాసిన జానకీ రాణి గారికి ఫోను చేశాను. అప్పుడు (2007లో ) నేను ఆదిలాబాదు జిల్లా కాగజునగరులో ఉండేవాణ్ని. నా పరిచయం చేసుకుని మాటలు మొదలు పెట్టగానే ఎంతో ఆత్మీయంగా స్పందించి చాలా సేపు మాట్లాడిన సందర్భం కనుల ముందు తారట్లాడింది. చివరగా ‘మీ మామయ్యా వాళ్లింటివద్దనే మా ఇల్లు ఈసారి వచ్చినప్పుడు తప్పక రమ్మని ‘ఆహ్వానించడం నేను పోలేక పోవడం గుర్తుకు వచ్చి నిన్నంతా ఒకటే ఆవేదన. వామన్ రావు మామయ్యంటే ఆమెకు ఎనలేని గౌరవం అభిమానం అని మాటల వల్ల తెలిసింది. ఆ తరువాత మా పైడిమర్రి రామక్రిష్ణ ద్వారా తెలిసింది ఆమే రేడియో అక్కయ్య అని. ఓసారి ఏదో పుస్తకావిష్కరణ సభ త్యాగరాయ గాన సభలో జరిగితే వచ్చారు. దగ్గిరగా వెళ్లి పలకరిస్తే ఎంతో ప్రేమ పూర్వకంగా మాట్లాడారు.
1936 లో 31 ఆగస్టున రాజ్యలక్ష్మి వెంకటరత్నంలకు మచిలీ పట్నంలో జన్మించిన జానకీ రాణి ఎం.ఏ ఎకనామిక్స్ చేసి పిహెచ్.డి మధ్యలో వదలి వేశారు. జానకి రాణి గారికి నృత్యం అంటే చాలా ఇష్టం. నాట్యం నేర్చుకోవడమే కాదు ‘నాట్య కళా భూషణ ‘అనే బిరుదు పొందినా,కొన్ని అనుకోని పరిస్తితులవల్ల జానకీ రాణి గారు 1974 లో ఆకాశవాణి లో చేరాల్సి వచ్చింది జీవిక కోసం పిల్లల భవిష్యత్తు కోసం .భర్త తురగా కృష్ణ మోహన్ రావు గారు ఆకాశవాణి లో జర్నలిస్టుగా పని చేస్తూ ప్రమాదంలో ఆకస్మిక మరణం పాలు కావటం తురగా జానకీ రాణి గారి జీవితం లో ఒక పెద్ద విషాదం.
ఆకాశవాణి లో చేరిన తరువాత బాలల కార్యక్రమాల్ని రూపొందించడంలో తనకు ఇష్టమయిన నృత్యాన్ని పక్కనబెట్టి బాల రచయిత్రిగా తమ శక్తి యుక్తుల్ని వినియోగించి అచిర కాలం లోనే తగిన గుర్తింపు పొందారు. చేపట్టిన పనిని తపస్సులా భావించే జానకీ రాణి పిల్లకోసం అనేక నాటికలు రాశారు.ఆకాశవాణిలో బాలానందం, బాలవినోదం, బాలవిహారం వంటి కార్యక్రమాల్లో అక్కయ్య కృషి అంతా ఇంతా కాదని సన్నిహితులు చెప్తారు.
గమ్మత్తయిన విషయ మేమిటంటే జానకీ రాణి గారు ఆకాశవాణి ఉద్యోగం లో చేరక మునుపు రేడియో ఆర్టిస్టు గా పని చేశారట. సాయంత్రం 7 నుండి 7.50 వరకు కథానికా పఠనం చేసే వారు. ఆకాశవాణిలో ఆమె అనేక కొత్త ప్రయోగాలు చేశారు.చొప్పదంటు ప్రశ్నలు,బాలవాణి వంటి కార్యక్రమాలు, కంగారు మామయ్య,కొంటె కృష్ణయ్య,వెర్రి వెంగళప్ప వంటి పాత్రలు ప్రవేశపెట్టి చిట్టి పొట్టి చిన్నారి శ్రోతలకు దగ్గరయ్యారు.పలు పత్రికల్లో వీరు రచించిన కథలు ప్రచురించబడి వీరికి బాల సాహిత్య నిర్మాతల్లో ఒకరిగా స్థానం లభించింది. సన్మానం,మంచిమనస్సు,ఉపాయం,వాదన,ఆడపిల్ల వంటి కథలతో వీరి ‘మిఠాయి పొట్లం ‘కథల సంపుటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘పబ్లికేషన్స్ డివిజన్’ ప్రచురించింది.పిల్లలు పూర్తిగా చదివి ఆనందించాలంటే సరదా,హాస్యం తప్పని సరిగా ఉండాలనే నిత్యసత్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీరు కథలు రాశారు.వీరి బి. నందం గారి ఆసుపత్రి అనే హాస్య నాటిక సున్నితమైన హాస్య ధోరణి తో పిల్లలని మార్చవచ్చని సూచిస్తుంది. బాలానందాన్నే బి. నందం డాక్టరుగా సృష్టించారు. ఐ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ బాలల అకాడెమీ వారు ప్రచురించారు. వీరి మరో కథల సంపుటి ‘బంగారు పిలక ‘ని నేషనల్ బుక్ ట్రస్టు వారు ప్రచురించారు.రెడ్ క్రాస్ కథను అనువదించారు.ఇవే కాక ఐ దేశం ఒక హిమాలయం,చేతకాని నటి వంటి రచనలు చేశారు.
రేడియో కార్యక్రమానికి మానవ కంఠ ధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనే వారు ఎక్సపర్ట్స్ కానవసరం లేదు. ఏక్స్‌పీరియన్స్ ముఖ్యం. చెప్పదలచిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ విలువలుంటాయి. “రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకి వెళ్ళి వారి అనుభవాలు, వాళ్ళ నాలెడ్డ్ తెలుసుకోవాలి “అని గోదావరిఖని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం….ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి కార్యక్రమాలు ప్రజల వద్దకి వెళ్లి చేశారు.ఆ విధంగా సాధారణ ప్రజలని కూడా ఇందు భాగస్వామ్యులని చేయటం ద్వారా వారి అనుభవాలు నలుగురికీ తెలిసేవి. మహిళలకోసం కూడా కొత్త ప్రయోగాలు చేసాము.
“ఇది నా సమస్య” అని స్త్రీల కార్యక్రమం ప్రసారం చేసి స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియ పరిస్తే వాటి పరిష్కారాలు నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచేచెప్పే కార్యక్రమాలకు మంచి స్పందన వుండేది. వృద్ధుల కోసం తమ జీవితానుభవాలు తెలిపే “స్రవంతి” అనే కార్యక్రమం కూడా అలాంటిదే. వీటి వెనుక జానకీ రాణి గారు ఉన్నారు . ప్లానింగ్ ,ప్రొడక్షన్,ప్రెజంటేషన్ పకడ్బందీగా ఉంటే కార్యక్రమాలు ఫలవంతంగా ఉంటాయనే తురగా జానకీ రాణి గారు ఆ విషయంలో ఎల్లప్పుడూ శ్రద్ధ వహించేవారు. వీరి ఉద్యోగ నిర్వహణలో భాగంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి ,స్థానం నరసింహారావు,గోపీచంద్ ,వేలూరి శివరాం,అక్కినేని, ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం, జె.వి.సోమయాజులు , మంజుభార్గవి వంటి అనేకమంది ప్రముఖులతో కలిసి పని చేశారు.
దృశ్యశ్రవణ విధానంతో విజ్ఞానం అందించవచ్చని అమ్మ-పాప,చిలుక పలుకులు, ఉదయబాల, అమ్మా నేను బడికి పోతా,బంగారు పాప వంటి పలు సిడిలను రూపొందించారు జానకీరాణి. సేవలకు గుర్తింపుగా ‘సనాతన ధర్మ ‘,బాలసాహిత్య పరిషత్ ‘ వంటి పలు సంస్థలు వీరిని సత్కరించాయి. వీరికి 1991,1992లో వరుసగా రెండు సార్లు నేషనల్ బెస్ట్ బ్రాడ్ క్యాస్టరుగా అవార్డు పొందారు. జీవితంలోని ఒడి దుడుకులను ఎదుర్కొంటూ ప్రతీ విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న విదుషీమణి శ్రీమతి తురగా జానకీ రాణి ఎనభై సంవత్సరాల వయస్సులో కొంతకాలంగా అస్వస్థులుగా ఉండి కన్ను మూయటం ఇటు సాహితీ లోకానికీ ,అటు ఆకాశవాణి ,దృశ్య మాధ్యమ రంగానికి తీరని లోటు.
– వాధూలస
No comments:
Post a Comment